తెలుగోడి సత్తా ఇదీ.. ‘ ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ

NTR Biopic Movie Review

Share It!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ చిత్రం మొత్తానికి థియేటర్లకు రానే వచ్చింది. దాదాపు నాలుగు నెలలుగా విరామం లేకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు క్రిష్‌, నిర్మాత బాలకృష్ణలు సినిమాను రూపుదిద్దారు. పగలు, రేయి అని తేడా లేకుండా సినిమాను పూర్తి చేశారు. అలనాటి అన్నగారి జీవితాన్ని వెండితెరపై చూపించేందుకు శాయశక్తులా కృషి చేశారు. ఎన్టీఆర్‌ నటించిన, ఆయన నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలన్నింటిని బాలకృష్ణ ఆ పాత్రలను పోషిస్తూ ఆకట్టుకున్నారు. అయితే సినీ, రాజకీయ జీవితంలో ఎన్టీఆర్‌ ఆరితేరినందును ఆయన సినిమాలో కేవలం రెండున్నర గంటలు చూపిస్తే సరిపోదని భావించి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్‌ సినీ జీవితానికి సంబంధించిన కథాంశాన్ని చూపించారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించే సందర్భంలో సినిమాను సస్పెన్స్‌లో ఉంచారు. 
కథ: 1947లో బాలకృష్ణ(ఎన్టీఆర్‌) జీవితం ప్రభుత్వ రిజిస్ట్రార్‌గా ప్రారంభం అవుతుంది.  సినిమాల మీద ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి  మద్రాసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఆయన సతీమణి బసవతారకం(విద్యాబాలన్‌) ఆందోళన చెందుతుంది. కానీ పట్టుదలతో మద్రాసుకు వెళ్తాడు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్‌ సినీ జీవితంలో జరిగిన విశేషాలను తెరపై చూడాల్సిందే.. ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్టార్ హీరోగా ఎదిగే వరకు ఉన్న ఎత్తుపల్లాలను ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో కళ్లకు కట్టినట్టు చూపించారు.

విశ్లేషణ: సినిమా చూస్తే అనుకున్నట్లుగానే ఎన్టీఆర్‌ మళ్లీ జీవించినట్లయింది. ఆద్యంతం బాలకృష్ణ ఎన్టీఆర్‌లాగే కనిపించారు. పస్టాఆఫ్‌లో ఎన్టీఆర్‌ కుర్రాడిలా ఉన్నప్పుడు ఉండే పాత్రలో బాలకృష్ణ అందుకు అనుగుణంగా మేకప్‌ వేసుకున్నాడు. సెకండ్‌ ఆప్‌లో ఎన్టీఆర్‌ ఏజ్‌డ్‌గా ఉండే పాత్రలోనూ బాలయ్య ఒదిగిపోయాడు. 20 ఏళ్ల కుర్రాడిలా.. 60 ఏళ్ల ఎన్టీఆర్‌లా బాలకృష్ణ అలరించాడు. ఎన్టీఆర్‌ రెండు పార్టుల్లో భాగంగా మొదటి పార్టులో ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని చూపించారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు బసవతారకం, ఏఎన్నార్‌, ఇతర సినీ నటుల పాత్రలు ఇందులో కనిపిస్తాయి. దివిసీమలో వచ్చిన తుఫాను బాధితులను ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు ఆదుకునే సీన్స్‌ కనిపిస్తాయి. ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌ చాలా చక్కగా నటించారు. ఎన్టీఆర్‌ పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకు సంబంధించిన సీన్స్‌ కనిపిస్తాయి. అలాగే ‘యమగోల’, ‘అడవిరాముడు’ పాటలు ఇందులోనే కనిపిస్తాయి. ఇక ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి సినిమా ఫీల్డులోకి ఎంట్రీ సమయంలో కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ పడే స్ట్రగుల్‌ను చూడొచ్చు. ‘కథానాయకుడు’ పేర్లు పడుతుండగానే ‘గాన కీర్తి’ సాంగ్‌ వస్తుంది. సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్‌ రాజకీయ పార్టీని స్థాపిస్తాడు. అయితే అక్కడినే సినిమా ఎండ్‌ కానుంది. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రలో నటించిన రానా ఎంట్రీ మాత్రమే ఇస్తారు. బహుశా ఆయన సీన్స్‌ రెండో పార్టులో ఉండొచ్చు. 

సాంకేతిక వర్గం:బాలకృష్ణను ఎన్టీఆర్‌గా చూపించడంలో క్రిష్‌ ఓ సినీ బ్రహ్మగా నిలిచాడు. ఎన్టీఆర్‌ నిజ జీవితాన్ని చూస్తున్నామన్నట్లు అనిపిస్తుంది. సీన్‌ వెంట సీన్‌ వస్తూ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకునేలా క్రిష్‌ చక్కగా డైరెక్షన్‌ చేశారు. బ్యాక్‌రౌండ్‌ మ్యూజిక్‌తో కీరవాణి ప్రేక్షకులను కట్టిపడేశాడు. స్క్రీన్‌ ప్లే విషయంలో అవసరమైన చోట బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి ఒకేసారి కలర్‌లో మారే విధానాన్ని అద్భుతంగా చేశారు. సాయిమాధవ్‌ డైలాగ్‌లు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అప్పటి కాలంలో ఎలాంటి పదాలు వాడాలో ఆ విధంగానే డైలాగ్‌లు ఉండడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపినట్లయింది. ముఖ్యంగా ‘మనల్ని గెలిచే అవకాశం ఇతరులకు ఒకేసారి ఇవ్వాలి.. అది మనం పోయాకే’ అన్న డైలాగ్‌ ఆకట్టుకుంది. మొత్తంగా అనుకున్నట్లుగానే ఎన్టీఆర్‌ సక్సెస్‌ఫుల్‌గానే ఉందనే టాక్‌ వినిపిస్తోంది. 

యూనైటెడ్ దేశీ రేటింగ్ : 3.5/5

Share It!